

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్‌పై తమిళనాడులో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన కొత్త సినిమా టైటిల్ 'సండియార్' తీవ్ర వివాదానికి దారితీయడమే ఇందుకు కారణం. ఈ పేరు ఉద్దేశపూర్వకంగా ప్రాంతీయ, కుల ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉందంటూ పుదియ తమిళగం (పీటీ) పార్టీ నేతలు పోలీసులను ఆశ్రయించారు.
నవంబర్ 7న కమల్ హాసన్ 72వ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే 'సండియార్' అనే పదం ఒక నిర్దిష్ట ఆధిపత్య ధోరణిని, హింసను ప్రోత్సహించేలా ఉందని పుదియ తమిళగం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఈ పేరు ఉందని పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. కృష్ణస్వామి ఆరోపించారు.
గతంలో 2003లోనూ కమల్ హాసన్ తన చిత్రానికి 'సండియార్' అనే పేరును ఖరారు చేశారు. అప్పట్లో పీటీ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, ఆ పేరును 'విరుమాండి'గా మార్చి 2004లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పేరును తీసుకురావడం కక్షసాధింపు చర్యేనని కృష్ణస్వామి మండిపడ్డారు. ఎంపీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కమల్ హాసన్ ఇలా ప్రవర్తించడం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు గానీ, అటు చిత్ర బృందం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!