

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నప్పటికీ సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించే నటీనటులు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో నటుడు సునీల్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలు అందుకుంటున్న ఈయన నేపథ్యం తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సునీల్ రెడ్డి మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ, అభిలాష, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ముఠామేస్త్రి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి కుమారుడు. అయినప్పటికీ తండ్రి ఇమేజ్‌ను ఉపయోగించుకోకుండా నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
2018లో విజయ్ సేతుపతి నటించిన 'సీతాకత్తి'తో తెరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత మాస్టర్, డాక్టర్, బీస్ట్, జైలర్, మామన్నన్ వంటి సినిమాల్లో కనిపించారు. ముఖ్యంగా 'డాక్టర్' చిత్రంలోని మహాలీ పాత్రతో ప్రేక్షకులను నవ్వించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన తమ్ముడు వైభవ్ రెడ్డి కూడా నటుడే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో సునీల్ రెడ్డి కనిపించడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి ఆయనపై పడింది. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వెలిగిన తండ్రి వారసత్వం ఉన్నా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం తమిళ పరిశ్రమలో ప్రయత్నిస్తుండటం విశేషం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!