

ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రేమకథలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఇప్పుడు మరోసారి అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా 2027 నుంచి భారీ స్థాయిలో రొమాంటిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం అలీ అబ్బాస్ జాఫర్, మోహిత్ సూరి, మనీష్ శర్మ వంటి దర్శకులు ప్రేమకథలతో కూడిన విభిన్న ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రాల్లో సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యువతను ఆకట్టుకునే ప్రేమ, భావోద్వేగాలు, కొత్త తరహా కథనాలతో ఈ సినిమాలను రూపొందించనున్నారట.
ఈ ప్రాజెక్టుల్లో అహాన్ పాండే, శార్వరి జంటగా నటించనున్న గ్యాంగ్‌స్టర్ ప్రేమకథ ఒకటి కాగా.. అహాన్ పాండే, అనీత్ పడ్డా మరోసారి జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథలో కనిపించనున్నారట. అలాగే అంబ్రిష్ వర్మ, సారా అర్జున్ జంటగా పంజాబ్ నేపథ్యంలో మరో రొమాంటిక్ సాగాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. వీటితో పాటు భారీ తారాగణంతో సాగే ప్రేమ త్రికోణ కథను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టు 2027 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆదిత్య చోప్రా మళ్లీ ప్రేమకథలతో బాలీవుడ్‌లో కొత్త సందడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!