

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శీతాకాలం ప్రారంభం కావడంతో వాయు కాలుష్యం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణించే ప్రమాదం ఉండటంతో కేంద్ర వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ముందస్తు చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. నవంబర్ 5 నుంచి 20 వరకు ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) జిల్లాల్లో కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాలి. మిగిలిన సిబ్బంది ఇంటి నుంచే పనిచేసేలా యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలి. అత్యవసర సేవలు, నిరంతరం పనిచేయాల్సిన పరిశ్రమలకు మినహాయింపులు ఉంటాయని సమాచారం.
కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన దుమ్ము, ధూళిని నియంత్రించేందుకు ఎన్‌సీఆర్ పరిధిలో నిర్మాణ, కూల్చివేత పనులపై కూడా ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. హైవేలు, రహదారులు, ఫ్లైఓవర్లు, విద్యుత్ లైన్లు, పైప్‌లైన్ల వంటి బహిరంగ నిర్మాణ పనులను నవంబర్ 20 వరకు నిలిపివేయనున్నారు. అయితే రైల్వేలు, మెట్రో సేవలు, విమానాశ్రయాలు, బస్ టెర్మినళ్లు, ఆసుపత్రులు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు, జాతీయ భద్రత, రక్షణకు సంబంధించిన అత్యవసర ప్రాజెక్టులకు మినహాయింపులు ఉంటాయి. గత కొన్నేళ్లుగా నవంబర్‌లో కాలుష్యం తీవ్రత పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పంట వ్యర్థాల దహనం, దీపావళి తర్వాత వెలువడే ఉద్గారాలు, వాహనాల పొగ, గాలి వేగం తగ్గడం, తేమ పెరగడం వంటి కారణాలతో కాలుష్య కణాలు వాతావరణంలో ఎక్కువసేపు నిలిచిపోతున్నాయి. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరకుండా నివారించడమే ఈ ముందస్తు ఆంక్షల ప్రధాన ఉద్దేశం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!