

టాలీవుడ్‌లో సినిమా నిర్మాణం పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడం ఒక ఎత్తయితే, సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన బ్యానర్ ఐడీ సాధించడం మరో పెద్ద సవాలుగా మారిందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ నిర్మాణ సంస్థలను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం ప్రతి నిర్మాత తమ బ్యానర్‌ను రిజిస్టర్ చేసుకుని ప్రత్యేక ఐడీ పొందాలి. ఈ ఐడీ ఉంటేనే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఇతర ప్రాంతీయ సెన్సార్ కార్యాలయాల్లో ఆధార్, పాన్ వంటి ప్రాథమిక పత్రాలతో 24 గంటల్లోనే ఐడీ జారీ అవుతుండగా, హైదరాబాద్ కార్యాలయంలో మాత్రం వారాలు, నెలల తరబడి జాప్యం జరుగుతోందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఆధార్ కార్డులో ఫొటో సరిగా లేదని, పాత ఫొటో తీసుకురావాలని వంటి కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, అదనంగా అఫిడవిట్ కూడా కోరుతున్నారని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆ ఫైళ్లు తిరిగి హైదరాబాద్‌కు రావడంతో జాప్యం మరింత పెరుగుతోందని వాపోతున్నారు.
హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ కార్యాలయానికి గత ఏడాది ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయి రీజినల్ ఆఫీసర్ (RO) లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం డాక్టర్ రాహుల్ గౌలికర్ ఇన్‌ఛార్జి ఆర్ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యానర్ ఐడీ జారీ ప్రక్రియలో ఇబ్బందులు పెరిగాయని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను వివరించేందుకు అపాయింట్‌మెంట్ కూడా లభించడం లేదని, ఫోన్‌లోనూ అధికారులు అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. ఐడీ జారీలో జాప్యం కారణంగా సినిమా విడుదలలు వాయిదా పడటంతో పాటు, నిర్మాతలపై వడ్డీల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సెన్సార్ బోర్డుకు లేఖ రాసినా స్పందన రాలేదని సమాచారం. తాజాగా నిర్మాతల మండలి సెంట్రల్ సెన్సార్ బోర్డు ఛైర్మన్ వెంపటి శశికుమార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. హైదరాబాద్ కార్యాలయానికి పూర్తిస్థాయి రీజినల్ ఆఫీసర్‌ను నియమించి, ఐడీ జారీ ప్రక్రియను సరళతరం చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!