

కృత్రిమ మేధ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నటీమణులు ఈ సమస్యపై స్పందించగా, తాజాగా హీరోయిన్ శ్రియ శరణ్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను కూడా ఏఐ మార్ఫింగ్ బాధితురాలినేనని వెల్లడించారు. తన ఫొటోలను ఇష్టానుసారంగా మార్చి ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడంపై స్పందిస్తూ, కొన్నిసార్లు ఆ చిత్రాలను చూస్తే అందులో ఉన్నది నిజంగా తానేనా అని తనకే నవ్వొస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు.
ఏఐ సాయంతో శరీర భాగాల రూపాన్ని మార్చడం, ఫొటోల్లోని దుస్తులను తొలగించినట్లు చూపించడం వంటి చర్యలు జరుగుతున్నాయని శ్రియ తెలిపారు. మొదట్లో ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకున్నప్పటికీ, పదేపదే జరుగుతున్న ఈ దుర్వినియోగం విసుగు తెప్పిస్తోందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఏఐ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని దుష్ప్రభావాలను కూడా గుర్తించాలని హెచ్చరించారు. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శ్రియ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!