

కన్నడ చిత్రసీమలో నిర్మాణ సంస్థగా ప్రయాణం ప్రారంభించిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావశీలమైన బ్యానర్లలో ఒకటిగా ఎదిగింది. 'కేజీఎఫ్', 'కాంతారా', 'సలార్' వంటి విజయాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ప్రతిష్ఠాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అభిమానుల దృష్టి ఎక్కువగా 'సలార్ పార్ట్ 2'పైనే ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో రూపొందిస్తున్న 'డ్రాగన్' పూర్తి కాగానే 'సలార్' సీక్వెల్ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించడంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు 'కేజీఎఫ్ చాప్టర్ 3' కూడా సంస్థ భవిష్యత్ ప్రణాళికల్లో కీలకంగా కొనసాగుతోంది. అయితే ప్రశాంత్ నీల్, యష్ తమ తమ సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. ఇదే సమయంలో ప్రభాస్‌తో 3 చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్న హోంబలే, ఆయనతో మరిన్ని భారీ ప్రాజెక్టులను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
తెలుగు, కన్నడతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ తన నిర్మాణాలను విస్తరించేందుకు హోంబలే అడుగులు వేస్తోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్యతో ఓ భారీ చిత్రం రూపొందనుండగా, హృతిక్ రోషన్‌తో కూడా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి 'మహా అవతార్' సినిమాటిక్ యూనివర్స్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది. 'మహా అవతార్ నరసింహ'తో ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో 2027లో 'మహా అవతార్ పరశురామ్', 2029లో 'మహా అవతార్ రఘునందన్', 2031లో 'మహా అవతార్ ద్వారకాధీశ్' చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ యూనివర్స్‌ను 2037 వరకు విస్తరించే ప్రణాళిక కూడా ఇప్పటికే ప్రకటించారు. భారతీయ పురాణాలను అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న హోంబలే, రాబోయే రోజుల్లో భారతీయ సినిమా భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్మాణ సంస్థగా నిలవబోతోందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!