

మలయాళ నటి అనశ్వర రాజన్ రోషన్ మేకా నటించిన ఛాంపియన్ సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తన అందం, నటనతో యువతను ఆకట్టుకున్న ఆమెకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాలో అవకాశం దక్కింది. నవంబర్ 13న విడుదల కానున్న ఇట్లు అర్జున సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనశ్వర హైదరాబాద్‌లో తనకు నచ్చిన విషయాలు, సినీ ప్రయాణం, తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హైదరాబాద్‌లో నీలోఫర్ బన్ మస్కా అంటే తనకు చాలా ఇష్టమని, దాన్ని తినేందుకు ఎవరూ గుర్తుపట్టకుండా క్యాప్ పెట్టుకుని వెళ్లేదాన్నని చెప్పారు. అయినప్పటికీ కొందరు అభిమానులు తనను గుర్తించారని తెలిపారు. అన్ని భాషల సినిమాలను ఆదరిస్తూ, నటీనటులపై ప్రేమ చూపించే తెలుగు ప్రేక్షకుల తీరు తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు.
స్కూల్ రోజుల్లో మోనో యాక్టింగ్, స్కిట్స్‌లో పాల్గొన్నప్పటికీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని అనశ్వర గుర్తుచేసుకున్నారు. ఓ సినిమా ఆడిషన్స్ ప్రకటన చూసి కుటుంబ స్నేహితులు ప్రోత్సహించడంతో ఆడిషన్‌కు వెళ్లానని, దాదాపు 6 వేల మందిలో తనను ఎంపిక చేయడంతో నమ్మలేకపోయానని చెప్పారు. కాకా సినిమాలో చిరంజీవితో కలిసి నటించడం గొప్ప అనుభూతి అని పేర్కొంటూ, ఆయన వ్యక్తిత్వం, హుందాతనం, వృత్తిపట్ల నిబద్ధతను ప్రశంసించారు. సెట్లో ప్రొఫెషనల్‌గా ఉంటూనే అందరితో సరదాగా గడుపుతారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. అల్లు అర్జున్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన సినిమాలు మలయాళంలోకి డబ్ అయినప్పుడు స్నేహితులతో కలిసి థియేటర్లకు వెళ్లి సందడి చేసేవాళ్లమని వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఆయన్ను కలిసే అవకాశం రాలేదన్నారు. తన చర్మ సంరక్షణ కోసం ప్రతిరోజూ సన్‌స్క్రీన్, మంచి మాయిశ్చరైజర్ వాడటంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగుతానని తెలిపారు. ఐదేళ్ల క్రితం క్రమం తప్పకుండా క్రీడలు ఆడే సమయంలో చర్మం ట్యాన్ కాకుండా సన్‌స్క్రీన్ ఉపయోగపడిందని చెప్పారు.
తన వ్యక్తిగత అభిరుచుల గురించి మాట్లాడుతూ, భావోద్వేగాల పరంగా పరిణతి కలిగి, మృదువుగా మాట్లాడే అబ్బాయిలంటే ఇష్టమని అనశ్వర తెలిపారు. ఆల్ఫా తరహా వ్యక్తిత్వం ఉన్నవారు తనకు నచ్చరని, బాహ్య అందం కంటే వ్యక్తిత్వం, మాట్లాడే విధానానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తనకు ఎక్స్ ఖాతా ఉన్నప్పటికీ ఎక్కువగా ఉపయోగించనని, తన పోస్టులతో పాటు తల్లి, అక్క పోస్టులకు అభిమానులు చేసే కామెంట్లు చూసి ఆనందిస్తానని అన్నారు. సూపర్ శరణ్య సినిమాలో కలిసి నటించిన మమితా బైజు తనకు మంచి స్నేహితురాలని, ఆరోగ్యం బాగోలేని సమయంలో కూడా ఆమె ఎంతో అండగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు. తనకంటే నాలుగేళ్లు పెద్దదైన అక్కతో ప్రతి విషయాన్ని పంచుకుంటానని, దుస్తుల ఎంపిక నుంచి ముఖ్యమైన నిర్ణయాల వరకు ఆమె సలహా తీసుకుంటానని చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం న్యూ ఇయర్ సందర్భంగా అక్కతో కలిసి కజిన్ ఇంటికి వెళ్తున్నామని చెప్పి అర్ధరాత్రి వరకు బయట తిరిగొచ్చినప్పుడు తల్లి మందలించడంతో ఆ రాత్రి కజిన్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని ఓ సరదా జ్ఞాపకాన్ని పంచుకున్నారు. స్కాట్లాండ్‌కు ఒంటరిగా వెళ్లిన పర్యటన తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. తన కలల రొమాంటిక్ డేట్ గురించి చెబుతూ, తనకు సన్‌ఫ్లవర్స్, తెల్లటి పియోనీస్ పూలంటే చాలా ఇష్టమని, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉండాలని కోరుకుంటానని చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!