

తన గంభీరమైన స్వరం, విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ త్వరలో ‘వన్స్ మోర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విఘ్నేష్ శ్రీకాంత్ దర్శకత్వంలో అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా తన కెరీర్ గురించి మాట్లాడిన అర్జున్ దాస్.. తొలినాళ్లలో తనకు ఎక్కువగా ప్రతినాయక పాత్రలే వచ్చేవని, భిన్నమైన పాత్రలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలను తిరస్కరించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత అనుకోకుండా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో నటించే అవకాశం దక్కిందన్నారు.
అజిత్ కుమార్‌తో తన అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని అర్జున్ దాస్ తెలిపారు. ఒకప్పుడు అజిత్ వద్ద సాధారణ ఉద్యోగిగా పనిచేసిన తాను.. ఇప్పుడు ఆయనకు ఎదురుగా ప్రతినాయకుడిగా నటించే స్థాయికి ఎదగడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ‘ఖైదీ’లో తన పాత్రను చూసి బయట కూడా తాను చాలా సీరియస్‌గా ఉంటానని చాలామంది భావిస్తారని, అయితే తనను వ్యక్తిగతంగా కలిసినప్పుడే తన అసలు స్వభావం అర్థమవుతుందని పేర్కొన్నారు. తన పాత్రలను ఆధారంగా చేసుకుని నిజ జీవితంలోనూ తన గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం సహజమేనని, వాటిని మార్చడం తన చేతుల్లో లేదని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!