

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు బరిలోకి దిగితే బాక్సాఫీస్ ఆసక్తి పెరగడం ఖాయం. గతంలో ‘భోళా శంకర్’, ‘జైలర్’ చిత్రాల సమయంలో వీరిద్దరి సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు దసరా, సంక్రాంతి రేసుల్లో ఈ లెజెండ్స్ మధ్య పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అక్టోబర్ 15న ‘జైలర్ 2’ విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మరోవైపు వాయిదాలు పడుతున్న చిరంజీవి ‘విశ్వంభర’ను అక్టోబర్ 16న దసరా కానుకగా తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజైన ఆగస్టు 22న దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్కరోజు తేడాతో ఇద్దరి సినిమాలు థియేటర్లలో సందడి చేసే ఛాన్స్ ఉంది.
ఇదే పోటీ 2027 సంక్రాంతికి కూడా కొనసాగవచ్చనే టాక్ వినిపిస్తోంది. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ నటిస్తున్న ‘ధర్మన్’ చిత్రాన్ని పొంగల్‌కు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. అదే సమయంలో బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న ‘మెగా158’ ప్రాజెక్ట్‌ను సంక్రాంతి బరిలో దించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దసరాతో పాటు సంక్రాంతిలోనూ ఇద్దరి సినిమాలు ఎదురెదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే భారీ చిత్రాల విడుదల తేదీలు చివరి దశలో మారడం సాధారణమే. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న తేదీలే తుది నిర్ణయాలు అని చెప్పలేం. అధికారిక ప్రకటనల తర్వాతే క్లారిటీ వస్తుంది. ఈ బాక్సాఫీస్ పోరులో చివరి వరకు ఏ సినిమాలు నిలుస్తాయో వేచి చూడాల్సిందే.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!