

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రం విడుదలకు ముందే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఏకకాలంలో అత్యధిక మంది నటీనటులను ప్రత్యక్ష సమయంలో మోషన్ క్యాప్చర్ చేసిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. మొత్తం 37 మంది ప్రదర్శకులను ఒకేసారి ప్రత్యక్ష మోషన్ క్యాప్చర్ ద్వారా చిత్రీకరించినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ అరుదైన రికార్డు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అల్లు అర్జున్ తన సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ సినిమాకు కొత్త ప్రమాణాలను నెలకొల్పే దిశగా ఈ చిత్రం సాధించిన ఘనత తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను ఉద్దేశించి మరికొంత కాలం ఓపికగా వేచి ఉండాలని కోరారు. ప్రాజెక్ట్ కోసం తగినంత సమయం తీసుకుంటున్నామని, ప్రేక్షకులకు థియేటర్లలో ఎప్పటికీ గుర్తుండిపోయే అత్యున్నత స్థాయి సినిమా అనుభూతిని అందించేందుకు చిత్రబృందం కష్టపడుతోందని చెప్పారు. ఈ నిరీక్షణకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుందని అభిమానులకు భరోసా ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!