

దాదాపు నాలుగేళ్ల సెన్సార్, న్యాయపోరాటాల అనంతరం ప్రముఖ నటుడు దిల్జిత్ దొసాంజే నటించిన 'సత్లుజ్' చిత్రం ఓటీటీలో విడుదలై కేవలం 48 గంటల్లోనే భారతదేశంలో స్ట్రీమింగ్ నుంచి తొలగించబడింది. దర్శకుడు హనీ ట్రెహన్ తెరకెక్కించిన ఈ చిత్రం పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా రూపొందింది. 1990లలో పంజాబ్‌లో జరిగిన వేలాది మంది అదృశ్యాల కేసులపై ఆయన చేసిన పరిశోధనలు, అనంతరం జరిగిన హత్య ఈ చిత్రానికి ప్రధాన నేపథ్యం. మొదట 'ఘల్లుఘరా', తర్వాత 'పంజాబ్ 95' పేర్లతో ప్రకటించిన ఈ సినిమా చివరకు 'సత్లుజ్' పేరుతో విడుదలైంది.
సెన్సార్ బోర్డు తొలుత 21 కట్స్, ఆ తర్వాత 127 కట్స్ సూచించడంతో చిత్రబృందం కోర్టును ఆశ్రయించింది. దీంతో సినిమా విడుదల సంవత్సరాల పాటు వాయిదా పడింది. చివరకు జూలై 3న ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా జీ5లో ఒరిజినల్ వెర్షన్ విడుదలైంది. అయితే రెండు రోజుల్లోనే చట్టపరమైన పరిణామాలను కారణంగా చూపుతూ జీ5 భారతదేశంలో స్ట్రీమింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. తొలగింపుకు గల అసలు కారణాన్ని వెల్లడించకపోయినా, అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో జీ5 గ్లోబల్లో సినిమా అందుబాటులో ఉండటంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!