

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అద్భుతమైన సినిమాలు, బాక్సాఫీస్ విజయాలు, తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనతతో ప్రసిద్ధి చెందారు. అయితే, ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా భార్య రమా రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రమా రాజమౌళి తమ బంధం ఎలా మొదలైందో వివరించారు. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి బంధువులు కాగా, కీరవాణి భార్య వల్లితో ఉన్న పరిచయం ద్వారా తమ కుటుంబాలకు సాన్నిహిత్యం ఏర్పడిందని తెలిపారు. కొన్నేళ్లపాటు కుటుంబ స్నేహంగా కొనసాగిన ఈ పరిచయం, కాలక్రమేణా పరస్పర అవగాహనగా మారిందని చెప్పారు. తమది పెద్ద ప్రేమకథ కాదని, ఒకరినొకరు అర్థం చేసుకోవడమే బంధాన్ని బలపరిచిందని పేర్కొన్నారు.
‘శాంతినివాసం’ రోజుల్లో తాము మరింత దగ్గరయ్యామని రమా రాజమౌళి గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రాజమౌళికి రావడంతో తమ బంధంపై మరింత స్పష్టత ఏర్పడిందని తెలిపారు. రాజమౌళి సిగ్గుపడే వ్యక్తి అని, సినిమాలపై ఎంతటి ఆసక్తి ఉన్నా కుటుంబానికి సమాన ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. వ్యక్తిగత విషయాల్లో తమ అభిప్రాయాలు ఎక్కువగా కలుస్తాయని, సినిమా పనుల విషయంలో మాత్రం అప్పుడప్పుడు చిన్నపాటి భేదాలు వస్తాయని వెల్లడించారు. సినిమాలతో పాటు ప్రయాణాలంటేనూ ఇద్దరికీ ఇష్టమని, రిటైర్మెంట్ తర్వాత మరిన్ని దేశాలను సందర్శించాలని అనుకుంటున్నామని తెలిపారు. తాము వెళ్లిన దేశాల నాణేలను సేకరించి, వాటిని ఒక ఫ్రేమ్‌లో భద్రపరచుకోవాలనేది తమ ప్రణాళిక అని చెప్పారు. రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా రమా గతంలో పంచుకున్న ఈ విషయాలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!