

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఏరియల్ విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. నవంబర్ 18, 2026న యాపిల్ మ్యాప్స్‌లో భారత్‌కు సంబంధించిన హై-రిజల్యూషన్ మ్యాపింగ్ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో హైదరాబాద్‌లోని కోకాపేట పరిసరాల్లో ఉన్న భారీ నిర్మాణాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. పురాతన భారతీయ దేవాలయాలు, ఎత్తైన శిఖరాలు, రాతి ఘాట్‌లు, విశాలమైన ప్రాంగణాలు, నీటి కొలనులు, పడవల నమూనాలతో కనిపిస్తున్న ఈ నిర్మాణాలు ‘వారణాసి’ సినిమా కోసం రూపొందించిన కాశీ సెట్ అయి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఇవి సినిమా సెట్స్ అని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు.
గతంలోనూ సినిమా టైటిల్ లాంచ్ సందర్భంగా డ్రోన్ ద్వారా మహేశ్ బాబు లుక్ బయటకు రావడంపై రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది పాటు గోప్యంగా ఉంచిన విషయాలు డ్రోన్ కారణంగా బయటపడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం ఎం.ఎం. కీరవాణి రీ-రికార్డింగ్, డబ్బింగ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు కొనసాగుతున్నాయి. వారణాసి, ఆఫ్రికా, అంటార్కిటికా, ప్రాచీన రోమ్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ చిత్రంలో మహేశ్ బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా కనిపించనున్నారు. ఐమ్యాక్స్ 1.43:1 ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన విజువల్స్ నిజంగానే ‘వారణాసి’ సినిమా సెట్స్‌వేనా అన్నది తెలియాలంటే చిత్రబృందం స్పందన కోసం వేచి చూడాల్సిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!