

దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను వీక్షించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చిత్రం తనను ఎంతగానో కదిలించిందని, ముఖ్యంగా ద్వితీయార్ధం భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. దర్శకుడు పవన్ సాధినేని ఓ స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి సహజమైన నటనతో తమ పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. శ్రుతిహాసన్, రుహాని శర్మతో పాటు మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారని పేర్కొన్నారు.
జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులకు మరింత చేరువైందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలతో కలిసి ఈ సినిమాను చూడాలని, ఇందులోని కథ పిల్లల్లో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని ఎక్స్ వేదికగా సూచించారు. కాగా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతిహాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి స్పందనను అందుకుంటోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!