

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ5 హిందీ ప్రేక్షకుల కోసం భారత్ భాగ్య విధాత చిత్రాన్ని ఆగస్టు 14, 2026న ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌గా అందిస్తోంది. మనోజ్ తపాడియా రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్-డ్రామా 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో రూపొందింది. ఆ సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన అజ్ఞాత వీరుల కథను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. కంగనా రనౌత్, గిరిజా ఓక్, స్మిత తాంబే తదితరులు ఇందులో నటించారు. పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీ, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ముంబైలోని కామా, అల్బ్లెస్ ఆసుపత్రి నేపథ్యంలో సాగే ఈ కథలో నర్సులు, వార్డ్ బాయ్స్, క్లీనర్లు, భద్రతా సిబ్బంది, ఇతర ఆసుపత్రి ఉద్యోగులు చూపిన తెగువను ప్రధానంగా ఆవిష్కరించారు. ఉగ్రవాదులు ఆసుపత్రిలోకి ప్రవేశించిన సమయంలో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ రోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వారు విధులు నిర్వర్తించారు. భయం కంటే కర్తవ్యాన్ని, స్వార్థం కంటే మానవత్వాన్ని ఎంచుకున్న వారి త్యాగం, దృఢ సంకల్పం, నిస్వార్థ సేవను ఈ చిత్రం తెరపై చూపించనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ప్రత్యేకతను సంతరించుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!