

తిరుమల లడ్డూ తయారీకి గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే, నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆయన అన్నారు. 2019–2024 మధ్య కిలో నెయ్యిని రూ.320 నుంచి రూ.419 వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ధర కిలోకు సుమారు రూ.1,000 ఉండగా, తిరుమలకు రూ.658కే సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ, ఈ ధరకు అందిస్తున్న నెయ్యి నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు. గురువారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వైఖరిపై కూడా విమర్శలు చేశారు.
రాయలసీమలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వెయ్యి టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డును రద్దు చేసి, రాజకీయ నాయకులకు బదులుగా మఠాధిపతులు, పీఠాధిపతులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు. తిరుమల చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని కూడా వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన, కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసిన ఆయన, మత మార్పిడులు ప్రలోభాలతో జరగకూడదని అభిప్రాయపడ్డారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!