

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ పట్టు సాధించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రైతు సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని రైతు గర్జన సభలు నిర్వహిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీ తన ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకుని ఏడు స్థానాలను గెలుచుకుంది. మరోవైపు బీఆర్ఎస్ ఓటు శాతం తగ్గడంతో పాటు అధికారాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోల్పోయిన రాజకీయ బలాన్ని తిరిగి సాధించేందుకు గులాబీ పార్టీ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా రైతుల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చర్చను పెంచుతూ ఉత్తర తెలంగాణలో తన పునాదులను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు ఉత్తర తెలంగాణలో బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రజా సమస్యలపై చురుగ్గా వ్యవహరించడం లేదనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీజేపీ బలమైన పోరాటం చేయడం లేదని, తమకు మద్దతుగా నిలిచిన ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పై పోరాటం చేస్తున్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం అంతగా దూకుడు ప్రదర్శించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రైతుల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకుంటూ కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ పరిణామాలు ఉత్తర తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!