

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పలు పోరాటాలు, నిరసనలు చేపట్టినా ఆశించిన మార్పు కనిపించడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఓటు ద్వారా ఇచ్చే తీర్పుతోనే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందని అన్నారు. త్వరలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, తెలంగాణలో నాలుగు కోట్ల మంది జనాభాలో సుమారు 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని తెలిపారు. అయితే వారిలో ఇప్పటివరకు 10 లక్షల మంది కూడా ఓటర్లుగా నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని కవిత కోరారు. తమ ఓటు ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు తమ తీర్పు చెప్పవచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది మంది యువ ఎంపీలు ఉంటే, వారిలో ఒక్కరే రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ రూ.200 కోట్లు ఖర్చు చేయాలని చూస్తోందని ఆరోపించారు. యువత డబ్బులకు ప్రభావితం కాకుండా స్వతంత్రంగా ఓటు వేయాలని సూచించారు.
ఈ ఎన్నికలు 77 నియోజకవర్గాల్లో జరగనున్నాయని, బుధవారం నుంచి అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించినట్లు కవిత వెల్లడించారు. తెలంగాణ రక్షణ సేన అభ్యర్థులకు వీర తిలకం దిద్ది ఎన్నికల బరిలోకి దింపుతున్నామని అన్నారు. ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతామని తెలిపారు. తమ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు ఉందని కవిత పేర్కొన్నారు. పార్టీకి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ, వాటికి సంబంధించిన సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!