

దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రజాస్వామ్యం లైసెన్స్ ఇవ్వదని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. యువతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ విపక్షాలు అశాంతిని ప్రోత్సహిస్తున్నాయని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో యువత నిర్మాణాత్మక పాత్ర పోషించేలా ప్రోత్సహించాల్సిన రాజకీయ పార్టీలు, వారిని రాజకీయ ఘర్షణలకు ఉపయోగించుకోవడం సరికాదన్నారు. బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలను ఆదర్శంగా తీసుకుని భారత్లోనూ ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నట్లు విపక్ష నేతలు చెబుతున్నారని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఆందోళనల పేరుతో ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు.
విపక్షాల ర్యాలీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, శాంతిభద్రతలను కాపాడేందుకు చట్టాన్ని గౌరవించడం అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల తీర్పును గౌరవించి, తన రాజకీయ పాత్రపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మరోవైపు, విపక్షాల నిరసనలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో మాట్లాడిన ఓ వీడియోను పంచుకుంటూ, ఎన్నికల్లో గందరగోళం సృష్టించడం ద్వారా ప్రధాని పదవిని సాధించలేరని, ప్రజల హృదయాలను గెలుచుకోవడం ముఖ్యమనే సందేశాన్ని ప్రతిపక్షాలకు ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!