

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఖండించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు మరో రెండు నెలలు పడుతుందంటూ వైరల్ అవుతున్న సమాచారం అవాస్తవమని స్పష్టం చేసింది. అలాగే ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లకు సంబంధించిన కోర్టు కేసుల్లో క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని తెలిపింది.
ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియా, ఇతర అనధికారిక వేదికల్లో వైరల్ అవుతున్న సమాచారం ఎస్‌ఈసీ జారీ చేసినది కాదని కమిషన్ స్పష్టం చేసింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, ఇతర భాగస్వాములు ధ్రువీకరణ లేని సమాచారాన్ని నమ్మడం లేదా ప్రచారం చేయడం, ఇతరులకు పంపించడం చేయవద్దని సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. ఎస్‌ఈసీ పేరుతో కల్పిత లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!