

హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిధులతో రాజకీయ పార్టీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంపై విషం చిమ్మే శక్తుల కోసం ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇది భారత్ సమ్మిట్ కాదని, భారత వ్యతిరేక సమ్మిట్ అని వ్యాఖ్యానించారు. భారత అభివృద్ధిని, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీపై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
భారత్ వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని విమర్శించిన కిషన్‌రెడ్డి.. ఆయన విజన్ ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో పెట్టుబడులను అడ్డుకునేందుకే భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం, నక్సలిజం, పేదరికం తగ్గడంతో పాటు కుల, మత రాజకీయాలు కూడా తగ్గాయని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని రాహుల్ గాంధీ ఎప్పుడూ అభినందించలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై భారత్ సమ్మిట్ వేదికగా రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత, రాహుల్ గాంధీకి స్పష్టమైన విజన్ లేకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోపించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!