

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిధులు కేటాయించినప్పటికీ వాటిని ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన ప్రతి రూపాయి అర్హులైన లబ్ధిదారులకు చేరాలని స్పష్టం చేశారు. సాధారణ పథకాల కింద చేసే ఖర్చులను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ఉప ప్రణాళిక నిధుల ఖర్చుతో కలిపి చూపించకూడదని ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వినియోగించని నిధులు, పెండింగ్ బిల్లులు, పథకాల అమలులో ఉన్న అడ్డంకులను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వైద్య సేవల బిల్లుల పెండింగ్ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.242 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ బకాయిలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, అర్హులైన రోగులకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 39 కేంద్రీకృత వంటశాలల పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేకుండా, కేటాయించిన నిధులు సకాలంలో అర్హులకు చేరేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!