

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పురపాలక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మూడు పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదిలీ పక్కాగా జరగడం కూటమి విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి పార్టీలు విజయం సాధించాయి. మొత్తం 87 మున్సిపాలిటీల్లో 17 చోట్ల ఛైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 70 చోట్ల ఎన్నికలు నిర్వహించారు. చీరాల మినహా మిగతా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు పూర్తికాగా, 66 మున్సిపాలిటీల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. ప్రారంభంలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల కేటాయింపుపై కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చలతో సమస్యలు పరిష్కారమయ్యాయి. బీజేపీకి కూడా పలు చోట్ల సీట్లు కేటాయించి, మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు.
కార్యకర్తల స్థాయి వరకు కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేయడం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ లక్షా 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అయిన తీరుకు ఉదాహరణగా నిలిచింది. మరోవైపు అనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ అభ్యర్థి అజేష్‌బాబు వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలైనా, కూటమి గట్టి పోటీ ఇచ్చింది. సాలూరు, ముమ్మిడివరం, తిరువూరు, పెడన, పుత్తూరు, మడకశిర, పుట్టపర్తి వంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థుల విజయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారం కీలకమైంది. బీజేపీ గెలిచిన మున్సిపాలిటీల్లోనూ మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేశాయి. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఉన్న సానుకూలతతో పాటు కూటమి ఐక్యత, పరస్పర సహకారం ఈ ఎన్నికల్లో భారీ విజయానికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!