

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘దేశద్రోహి’ అంటూ వ్యాఖ్యానించిన ఆయన, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీని నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని చర్చకు వస్తే ఐదు నిమిషాల్లో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్లమెంటులో చర్చకు రావాలని తాను కోరితే, ఎన్డీయే నేతలు సభలో చర్చిద్దామని చెబుతున్నారని, అయితే లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మాదకద్రవ్యాల సమస్యను నిర్మూలించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడేళ్ల గడువు విధించడంపై స్పందిస్తూ, అప్పటికి ఆయన ఆ పదవిలో ఉంటారో లేదోనని ఎద్దేవా చేశారు. తన అంచనా ప్రకారం ఏడాదిలోపే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు. బుధవారం పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జరిగిన ఇన్సాఫ్ ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అదానీ పోర్టులో పట్టుబడిన మాదకద్రవ్యాల వ్యవహారంపై అమిత్ షా సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఆ ఘటనపై కేంద్రం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. శాంతిభద్రతల గురించి మాట్లాడే ముందు గ్యాంగ్‌స్టర్లకు ప్రోత్సాహం లభిస్తోందన్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని అన్నారు. మణిపుర్‌లో పరిస్థితులపైనా కేంద్రం దేశానికి వివరణ ఇవ్వాలని కోరారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపైనా రాహుల్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో ఇచ్చిన హామీని భగవంత్ మాన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఆప్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గతంలో లోక్‌సభలో భగవంత్ మాన్‌తో కలిసి కూర్చున్నప్పుడు ఆయన జోకులు వేసేవారని, ఆయన నుంచి మద్యం వాసన వచ్చేదని రాహుల్ ఆరోపించారు. మాదకద్రవ్యాలపై పోరాడాలనుకునే ముఖ్యమంత్రి మద్యం మత్తులో ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సచిన్ పైలట్ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!