

మహిళల భాగస్వామ్యం లేకుండా దేశం సంపూర్ణ అభివృద్ధి సాధించలేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆస్క్ మి ఎనీథింగ్’ సెషన్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన మహిళా శక్తిపై ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాజకీయాలు, వ్యాపార రంగాల్లోనే కాకుండా సొంత ఇళ్లలో కూడా మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. మహిళలకు తమను తాము వ్యక్తపరచుకునే అవకాశం, స్వేచ్ఛ, సమాన భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల గళం వినిపించని దేశం అసంపూర్ణంగానే ఉంటుందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
ఈ వీడియోపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. కాంగ్రెస్ నుంచి ఎట్టకేలకు సానుకూల సందేశం వచ్చినట్లుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఇకనైనా బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనపై కేంద్రం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై విపక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!