

కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులతో పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సందీప్‌కుమార్ నిర్వహించిన ముఖాముఖి సమావేశాలు ముగిశాయి. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం, ఎంపీలు సురేశ్ షెట్కార్, అనిల్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. మల్రెడ్డి రంగారెడ్డి, నాగరాజు, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మురళీనాయక్, నాయిని రాజేందర్, నవీన్ యాదవ్ తదితరులతో విడివిడిగా చర్చలు జరిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం టీపీసీసీ సోషల్ మీడియా విభాగం నాయకులతో సమావేశమై, ఆ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
సందీప్‌కుమార్‌తో భేటీ అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి నుంచి జూన్ వరకు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నట్లు చెప్పారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ, రాజకీయంగా ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందని మంత్రి ఆరోపించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజల మధ్య ముఖ్యమంత్రి పాదయాత్ర చేయడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, రాహుల్‌గాంధీపై బీఆర్‌ఎస్ నేతలు మళ్లీ విమర్శలు చేస్తే గట్టిగా స్పందిస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హెచ్చరించారు. తెలంగాణ యువతపై రాహుల్‌గాంధీకి ఉన్న అభిమానంతోనే వారితో కలిసి భోజనం చేశారని, ఆయనను విమర్శించే నైతిక అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!