

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో విలువైన సమయాన్ని వ్యక్తిగత అంశాల ప్రస్తావనకు ఉపయోగించారని, నోరు తెరిస్తే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడమే ఆయన అజెండాగా కనిపిస్తోందని ఆరోపించారు. 22ఏకు సంబంధించిన అంశంతో లక్షలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నప్పటికీ వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించలేకపోయిందన్నారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల భూములున్నాయంటూ ఇంతకాలం ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, చివరకు 66 ఎకరాల ఫామ్‌హౌస్ మాత్రమే ఉందని చెప్పారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతల ఆస్తుల వివరాలు కావాలంటే తామే ఇచ్చేవాళ్లమని అన్నారు.
అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై సీఎం కనీసం విచారం వ్యక్తం చేయలేదని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తాము కూడా ఆడబిడ్డలమే కదా అని, తమకు జరిగిన అవమానంపై సభలో మాట్లాడాలని ఆశించినా అవకాశం దక్కలేదన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదైన కేసులను సీఎం పర్యవేక్షిస్తున్నప్పుడు తమపై జరిగిన ఘటన ఆయనకు తెలియదని ఎలా అనుకోవాలని ప్రశ్నించారు. తన రాజకీయ ప్రస్థానం, పార్టీ మార్పులు, తన కుమారుడు కార్తీక్ రెడ్డికి టికెట్ విషయంలోనూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. ఫిరాయింపులపై రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు. రైతుల భూములకు నష్టం కలగకుండా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చేపట్టాలని, తిమ్మాపూర్ భూదాన్ భూములపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలు అమలయ్యాయని గుర్తుచేస్తూ, కేసీఆర్ రాజకీయ అనుభవానికి రేవంత్ గౌరవం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో సుమిత్రానంద్, హేమ, మమత షకీలా రెడ్డి పాల్గొన్నారు. ఈ మధ్య అసెంబ్లీ పరిణామాలపై సబితా ఇంద్రారెడ్డి సహా బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు పోలీసుల తీరుపై ఆరోపణలు చేయడం, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం కూడా చోటుచేసుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!