

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ఎపిసోడ్ వినోదం, కామెడీ, భావోద్వేగాలు, వాదనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా దేబ్జానీ ఈ ఎపిసోడ్‌లో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖేశ్ గౌడతో ఆమె కెమిస్ట్రీ ఆసక్తికరంగా మారింది. తనకు ముఖేశ్ అంటే ఇష్టమని గతంలో చెప్పిన దేబ్జానీ.. అతడు వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడాన్ని చూసి రచ్చ చేసింది. తనను మోసం చేశాడంటూ సరదాగా ఆరోపించింది. దీనికి రామ్ ప్రసాద్ కూడా మద్దతు ఇవ్వడంతో వాష్‌రూమ్ ఏరియాలో నవ్వులు పూశాయి. ఈ సీన్ ఎపిసోడ్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
ఇక ‘డార్లింగ్’ అనే పదంపై జరిగిన చర్చలోనూ దేబ్జానీ తనదైన శైలిలో కామెడీ పండించింది. చాలామంది ‘డార్లింగ్’ అనే పదాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారని, కనీసం దాని స్పెల్లింగ్ కూడా తెలియదని నరేష్ ముందు చెప్పింది. నరేష్ స్పెల్లింగ్ చెప్పేందుకు ప్రయత్నించగా.. దేబ్జానీ సరదాగా అతడిని ఆపేయడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో దేబ్జానీని తెలుగు సరిగా మాట్లాడలేదనే కారణంతో అనర్హురాలిగా భావించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమెకు పలువురు కంటెస్టెంట్లు మద్దతుగా నిలిచారు. తనకు ఇంతమంది సపోర్ట్ చేయడాన్ని దేబ్జానీ సంతోషంగా స్వీకరించి.. ఇదే తన అసలైన సక్సెస్ అంటూ స్పందించింది. షాలినితో ఆమె చేసిన వాగ్వాదం కూడా ఆసక్తిని పెంచింది.
కెప్టెన్సీ కంటెండర్ల ఎంపిక కోసం నిర్వహించిన టాస్క్ కూడా ఉత్కంఠగా సాగింది. రెండో వారంలో ‘పవర్ ఆఫ్ పీపుల్’ థీమ్‌ను తీసుకొచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్సీ కంటెండర్లను ప్రేక్షకులే ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ప్రేక్షకుల ఓట్లతో త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలిని, ముఖేశ్, రోహిత్, ఝాన్సీ, ఆటో రాంప్రసాద్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారు. గజిబిజిగా ఉన్న అక్షరాల్లో దాగి ఉన్న పదాన్ని గుర్తించి, ఆ తర్వాత తమలో కెప్టెన్ అయ్యేందుకు ఎవరు అనర్హులో కంటెస్టెంట్లు నిర్ణయించాల్సి వచ్చింది. దీంతో ఒక్కొక్కరు మరొకరిపై ఆరోపణలు చేస్తూ గట్టి వాదనలకు దిగారు. తొలి రౌండ్‌లోనే త్రిగుణ్ ఎలిమినేట్ అయ్యాడు. పలువురు కంటెస్టెంట్లు అతడిని కెప్టెన్ అయ్యేందుకు అనర్హుడిగా భావించారు. అనంతరం రామ్ ప్రసాద్, దేబ్జానీ, రోహిత్ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. చివరికి ఝాన్సీ, షాలిని, అమన్, ముఖేశ్ గౌడ మధ్య పోటీ కొనసాగింది. వీరిలో అమన్, ముఖేశ్ పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది.
ఇదిలా ఉంటే.. త్రిగుణ్, సుధీర్ మధ్య విభేదాలు కూడా మరోసారి బయటపడ్డాయి. టిష్యూలు పడేయడం విషయంలో సుధీర్ వ్యవహరించిన తీరుపై త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. షాలినికి సపోర్ట్ చేసే విషయంలోనూ సుధీర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టాడు. ఒక దశలో సుధీర్ ముఖం కూడా చూడాలని లేదంటూ త్రిగుణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ తర్వాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. సృష్టి విషయంలో పూర్తి విషయం తెలుసుకోకుండా మాట్లాడావని, తన క్యారెక్టర్‌ను తప్పుగా చూపించావని త్రిగుణ్.. సుధీర్‌కు క్లాస్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
మొత్తంగా డే 9 ఎపిసోడ్‌కు దేబ్జానీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖేశ్‌తో ఆమె కెమిస్ట్రీ, ‘నన్ను మోసం చేశావు’ అంటూ చేసిన సరదా కామెంట్లు, డార్లింగ్ స్పెల్లింగ్‌పై చేసిన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ గేమ్‌ను మరింత సీరియస్‌గా మార్చింది. షాలిని, ఝాన్సీ కూడా తమ ఆటతీరుతో హైలైట్ అయ్యారు. కంటెస్టెంట్ల మధ్య ఈక్వేషన్స్ మారుతున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో మరిన్ని గొడవలు, వ్యూహాలు, ఊహించని ట్విస్టులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!