

పులివెందులలో పోలింగ్ సందర్భంగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. పోలింగ్ సమయంలో జరిగిన దాడులు, దొంగ ఓట్లు, ఇతర అక్రమాల వివరాలను ఆయన అధికారికి వివరించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను అనుమతించలేదని, వారిని బయటకు పంపించి ఓటర్లను బెదిరిస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ ఏజెంట్లు లేకుండా చేసి ఇష్టానుసారంగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. దాడులతో ఏమీ సాధించలేమని, అలాంటి చర్యలను తమ పార్టీ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని ఆరోపించారు.
మరోవైపు, ఓటు వేయకుండానే జగన్ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. పులివెందులలో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తాను కూడా ఓటు వేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబు మనిషిగా వ్యవహరిస్తోందని, అధికారులు కూడా ఆయన చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహిస్తేనే తిరిగి వచ్చి ఓటు వేస్తానని ప్రకటించారు. జరిగిన ఘటనలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎన్నికల సంస్కరణల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయని జగన్ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!