

నాలుగో వన్డే ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా చివరి పోరులో అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను ఓడించి వన్డే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు తొలుత బ్యాటింగ్‌లో తడబడింది. న్యూజిలాండ్ బౌలర్లు డఫీ, శాంట్నర్ ధాటికి 42.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. దీంతో న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. అర్ష్‌దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. గుర్నూర్ బ్రార్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు విదేశీ గడ్డపై ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.
భారత బౌలర్లు ఆరంభం నుంచే కివీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ శాంట్నర్ 24 పరుగులు చేశాడు. అర్ష్‌దీప్ కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీయగా.. సిరాజ్ కూడా ముఖ్యమైన సమయాల్లో వికెట్లు తీసి భారత్‌కు ఆధిక్యం అందించాడు. చివర్లో కివీస్ బ్యాటర్లు పోరాడినప్పటికీ భారత బౌలర్లు విజయాన్ని దూరం చేయలేదు. ఈ ఓటమితో సొంతగడ్డపై న్యూజిలాండ్ వరుసగా 11 వన్డే సిరీస్‌లు గెలిచిన రికార్డు ముగిసింది. సిరీస్‌లో ఇరు జట్లు బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పిచ్‌లు బౌలర్లకు ఎక్కువగా సహకరించాయని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా భారత్ 3-2తో గెలుచుకున్న విషయం తెలిసిందే.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!