

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయారు. ముఖ్యంగా నాలుగో వన్డేలో భారత జట్టు కేవలం 89 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో విదేశీ పిచ్‌లపై భారత బ్యాటర్ల ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. నాలుగో వన్డే అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టు బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ జరిగే దక్షిణాఫ్రికా పిచ్‌లపై కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. తాజాగా మాజీ కోచ్ రవిశాస్త్రి గంభీర్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ, బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
గంభీర్ వ్యక్తం చేసిన ఆందోళనలో వాస్తవం ఉందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉన్నప్పుడు బ్యాటర్లు సంయమనంతో ఆడాలని సూచించాడు. ప్రతిసారీ 320-330 పరుగుల భారీ స్కోర్లు సాధించాల్సిన అవసరం లేదని, కఠినమైన పరిస్థితుల్లో 260 పరుగులు చేసినా అది మ్యాచ్‌ను గెలిపించే స్కోరు కావచ్చని తెలిపాడు. మరోవైపు గంభీర్ మాట్లాడుతూ.. 90 పరుగులలోపే ఆలౌట్ కావడం ఏ జట్టుకైనా ఆందోళన కలిగించే విషయమని అన్నాడు. తనకు పరుగుల సంఖ్య కంటే, కేవలం 27 ఓవర్లలోపే పది వికెట్లు కోల్పోవడమే ఎక్కువ నిరాశ కలిగించిందని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశాడని అంగీకరిస్తూనే, భారత బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!