

అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ గెలుపులో పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోహిత్ ఉల్వా కీలక పాత్ర పోషించాడు. కేవలం 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి చివరి బంతికి ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం సహచరులు మోహిత్‌ను భుజాలపైకి ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు. అతడి ఆటతీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించారు. తీవ్ర ఒత్తిడిలోనూ మోహిత్ ప్రశాంతంగా వ్యవహరించడం తనకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని గుర్తు చేసిందని అన్నారు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ సిక్స్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించిన తర్వాత చేసిన సంబరాలను మోహిత్ విజయోత్సాహంతో పోల్చారు.
భారత కుర్రాళ్లు చివరి బంతి వరకు పోరాటాన్ని కొనసాగించడాన్ని గావస్కర్ ప్రత్యేకంగా అభినందించారు. 252 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయి, ఇంకా 80కి పైగా పరుగులు చేయాల్సిన పరిస్థితిలోనూ ఆటగాళ్లు నమ్మకం కోల్పోలేదని కొనియాడారు. మరోవైపు భారత ఆటగాళ్ల విజయోత్సాహంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. తమ తరం ఆటగాళ్లు పోటీని గౌరవంతో పాటు క్రీడా విలువలను పాటిస్తూ ఆడేవారని పేర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నాడు. భారత యువ జట్టు అద్భుతంగా ఆడిందని ప్రశంసిస్తూనే, పాకిస్థాన్ కూడా టోర్నీలో బాగా రాణించిందని, అయితే ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. కీలక సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కోవడంలో భారత్ మెరుగ్గా వ్యవహరించిందని పేర్కొంటూ టీమ్ఇండియాకు అభినందనలు తెలిపాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!