

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయంటూ ప్రచారం జరుగుతుండగా.. గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ తిరిగి వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హార్దిక్.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2022 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌లో చేరి తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాతి సీజన్‌లో గుజరాత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 2024లో ట్రేడింగ్ ద్వారా ముంబైకి తిరిగి వచ్చిన హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
అయితే హార్దిక్ ట్రేడ్‌పై వస్తున్న వార్తల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో అతడి ఫొటోలను పోస్ట్ చేయడం ఆసక్తిని పెంచింది. దీంతో ‘హార్దిక్ ముంబైలోనే కొనసాగనున్నాడా?’ అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ముంబై పోస్ట్‌ను చూసిన పలువురు అభిమానులు కూడా హార్దిక్ ముంబైలోనే ఉంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు హార్దిక్ భవిష్యత్తుపై స్పష్టత కోసం వేచి చూడాల్సిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!