

భారత్‌లో హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న కంట్రోల్‌ఎస్ డేటాసెంటర్స్ రూ.250 కోట్ల తాజా పెట్టుబడులను సమీకరించింది. ఇందులో జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టగా.. వ్యాపారవేత్త శ్రీరామ్ రెడ్డి వంగా రూ.50 కోట్లు పెట్టుబడిగా అందించారు. భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్ సామర్థ్యానికి డిమాండ్ కూడా పెరుగుతోంది.
కొత్తగా సమీకరించిన నిధులను డేటా సెంటర్ మౌలిక వసతుల విస్తరణ, సామర్థ్య పెంపునకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2007లో ప్రారంభమైన కంట్రోల్‌ఎస్ ప్రస్తుతం తొమ్మిది మార్కెట్లలో 19 డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. సంస్థ వద్ద 370 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉండగా.. మరో 4.4 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి. భారత్‌లో డిజిటల్ మౌలిక వసతులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ విస్తరణకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!