

సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత్ తరఫున పతకంపై భారీ ఆశలు పెట్టుకున్న లక్ష్యసేన్ రెండో రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అమెరికాకు చెందిన గారెట్ టాన్తో జరిగిన హోరాహోరీ పోరులో లక్ష్యసేన్ తొలి గేమ్ గెలిచినా.. ఆ తర్వాత ప్రత్యర్థి పుంజుకోవడంతో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. మరోవైపు యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన అద్భుత జోరును కొనసాగించాడు. శ్రీలంకకు చెందిన దుమిందు అబేయ్విక్రమను వరుస గేముల్లో ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. అంతకుముందు తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీపై ఆయుష్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పి.వి. సింధు కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌ను వరుస గేముల్లో ఓడించిన సింధు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆరో పతకంపై కన్నేసింది. తదుపరి రౌండ్లో చైనాకు చెందిన వాంగ్ జి యితో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ వాకోవర్‌తో నేరుగా ప్రిక్వార్టర్స్‌కు చేరింది. అయితే హరిహరన్ అమ్సకరుణన్-ఎం.ఆర్. అర్జున్ జోడీ దక్షిణ కొరియా జంట చేతిలో ఓడి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా కూడా కెనడాకు చెందిన మిచెలీ లీ చేతిలో పోరాడి ఓటమి పాలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!