

దాదాపు 12 ఏళ్ల పాటు భారత టెస్టు జట్టులో స్పిన్ విభాగానికి వెన్నెముకగా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ 2024 ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమ్ఇండియా స్పిన్ దళంలో కీలక లోటు ఏర్పడింది. అయితే ఇప్పుడు యువ ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ రూపంలో భారత్‌కు ఓ మంచి ప్రత్యామ్నాయం కనిపిస్తున్నాడు. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో అరంగేట్రం చేసిన సుతార్ ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తాజాగా శ్రీలంకతో గాలెలో జరిగిన టెస్టులో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకు గాలెలో ఉన్న మంచి రికార్డును కూడా సుతార్ తన అద్భుత ప్రదర్శనతో మించి ప్రభావం చూపించాడు.
ఈ మ్యాచ్‌లో 18 టెస్టుల అనుభవం ఉన్న కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్‌తో సరిపెట్టుకోగా.. సుతార్ మాత్రం 10 వికెట్లతో విజృంభించాడు. బంతిని చక్కగా తిప్పడంతో పాటు వేగం, గమనంలో వైవిధ్యం చూపిస్తూ శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకున్నప్పటికీ.. తన నియంత్రణ, బౌలింగ్ నైపుణ్యంతో సాధించిన వికెట్లే అతని ప్రదర్శనకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. రాజస్థాన్‌కు చెందిన ఈ యువ స్పిన్నర్ టెస్టు కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. భవిష్యత్తులో అతను ఏ స్థాయికి ఎదుగుతాడు, ఇదే నిలకడను ఎంతకాలం కొనసాగిస్తాడన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా.. ప్రస్తుతానికి మాత్రం టీమ్ఇండియాకు సుతార్ రూపంలో ఆశాజనకమైన స్పిన్ ఆయుధం లభించినట్లే కనిపిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!