

వెల్లింగ్టన్లో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 199 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. డారిల్ మిచెల్ 52 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిన్ అలెన్ 25 బంతుల్లో ఐదు సిక్సర్లతో 40 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 23 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 39 పరుగులు సాధించాడు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ టిమ్ సీఫెర్ట్‌ను రెండు పరుగులకే ఔట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే ఫిన్ అలెన్, డారిల్ మిచెల్ దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్ వేగంగా పరుగులు సాధించింది. నితీష్ కుమార్ రెడ్డి అలెన్‌ను ఔట్ చేయగా, అక్షర్ పటేల్ గ్లెన్ ఫిలిప్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. మరోవైపు భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో 40 పరుగులు, ప్రిన్స్ యాదవ్ నాలుగు ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో మిచెల్, జాకబ్స్ వేగంగా పరుగులు సాధించడంతో న్యూజిలాండ్ 198 పరుగుల స్కోరును నమోదు చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!