

రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు సత్తా చాటారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో త్రిపురను తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కట్టడి చేశారు. అనికేత్ రెడ్డి 5/21తో ఐదు వికెట్లు పడగొట్టగా, తనయ్ త్యాగరాజన్ 3/37తో రాణించాడు. ఓపెనర్లు బిక్రమ్‌కుమార్ దాస్ (50), హ్రితురాజ్ రాయ్ (33) తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించినా, ఆ తర్వాత త్రిపుర వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అభిరథ్ రెడ్డి 32 పరుగులు చేశాడు. త్రిపుర బౌలర్ సందీప్ సర్కార్ నాలుగు వికెట్లు తీశాడు.
మరోవైపు, ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక 274 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రవిచంద్రన్ స్మరణ్ 126 పరుగులతో శతకం సాధించగా, కృష్ణన్ శ్రీజిత్ 58 పరుగులు చేశాడు. తొలి రోజు ముగిసే సమయానికి ఆంధ్ర 2 వికెట్లకు 16 పరుగులు చేసింది. బెంగాల్ తరఫున మహ్మద్ షమీ 4/30తో రాణించడంతో దిల్లీ 240 పరుగులకు ఆలౌట్ అయింది. చండీగఢ్‌తో మ్యాచ్‌లో ముంబయి 249/5తో నిలవగా, యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ 80 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఛత్తీస్‌గఢ్‌తో పోరులో రవీంద్ర జడేజా అజేయంగా 72 పరుగులు చేయడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 308/4 స్కోరు సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!