

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు తన చిన్ననాటి రోజులకు సంబంధించిన ఓ మధురమైన జ్ఞాపకం ఉంది. 12 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ శిక్షణ కోసం తన కుటుంబానికి దూరంగా మదీరా నుంచి లిస్బన్‌కు వెళ్లిన ఆయన, ఆ సమయంలో తరచూ ఆకలితో ఇబ్బంది పడేవారు. రాత్రివేళల్లో తనతో పాటు శిక్షణ తీసుకుంటున్న ఇతర బాలురతో కలిసి మెక్‌డొనాల్డ్స్ వెనుక తలుపు వద్దకు వెళ్లేవారు. అక్కడ ఎడ్నా, మరో ఇద్దరు మహిళలు మిగిలిపోయిన బర్గర్లను వారికి ఇచ్చి ఆకలి తీర్చేవారు. ఆ మహిళల సహాయాన్ని రొనాల్డో ఇప్పటికీ కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నారు.
ఏళ్ల తర్వాత తనకు సాయం చేసిన మహిళలను కలిసి కృతజ్ఞతలు చెప్పాలని రొనాల్డో నిర్ణయించుకున్నారు. 2019లో వారిని విందుకు ఆహ్వానించాలని ఉందని వెల్లడించినప్పటికీ, వారి ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత ఎడ్నా కాల్డాస్ ముందుకు వచ్చారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత లిస్బన్ విమానాశ్రయంలో ఆమెను కలిసిన రొనాల్డో వెంటనే గుర్తుపట్టి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తన పిల్లలకు కూడా చిన్నతనంలో ఆమె చేసిన సహాయం గురించి వివరించారు. తన బృందం ఆ మహిళలను గుర్తించిందని, వారి కోసం ప్రత్యేకంగా ఏదో ఏర్పాటు చేస్తున్నానని రొనాల్డో చెప్పినప్పటికీ, ఆ వివరాలను ఇంకా వెల్లడించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!