

టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు, రైల్వేస్‌తో మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం తన ఆవేదనను వెల్లడించాడు. దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టులో అవకాశాలు దక్కకపోవడం బాధ కలిగిస్తోందని చెప్పాడు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులోనూ చోటు దక్కకపోవడం అతడి అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. తన కష్టాల గురించి మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఎందుకు కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి అని తనను తాను ప్రశ్నించుకుంటానని సర్ఫరాజ్ తెలిపాడు. గతంలో అధిక బరువుతో ఉన్నాడంటూ పలువురు విమర్శించారని, దీంతో ఆఫ్ సీజన్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి 22 కిలోల బరువు తగ్గానని గుర్తుచేశాడు. అయితే బరువు తగ్గిన తర్వాత కూడా తాను లావుగా ఉన్నప్పుడే బాగా ఆడేవాడినని కొందరు వ్యాఖ్యానించారని చెప్పాడు.
అలాంటి విమర్శలను తాను పట్టించుకోనని, సాధారణంగా కష్టపడుతూ ముంబై జట్టులో కొనసాగగలనని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. అయితే తన తండ్రి నౌషాద్ ఖాన్ పడుతున్న కష్టాన్ని చూసినప్పుడు ఆయన కోసమైనా మైదానంలో రాణించాలనిపిస్తుందని తెలిపాడు. జాతీయ జట్టులో అవకాశం కోసం తాను ఎవరి వెంటా పడబోనని స్పష్టం చేశాడు. సెలెక్టర్లు ఎంపిక చేస్తే టీమిండియా తరఫున ఆడతానని, లేదంటే ఓపిక ఉన్నంతవరకు దేశవాళీ క్రికెట్లో కొనసాగుతానని చెప్పాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున ఆరు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 66 మ్యాచ్‌లు ఆడి 5,354 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతడి ఖాతాలో 18 సెంచరీలు ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!