

ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు విధించిన గడువును బీసీసీఐ మరో రెండు రోజులు పొడిగించింది. తొలుత నవంబర్ 15తో ముగియాల్సిన గడువును నవంబర్ 17 వరకు పెంచుతూ సోమవారం ఫ్రాంచైజీలకు అధికారికంగా సమాచారం అందించింది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న మినీ వేలానికి ముందు ఆటగాళ్లను కొనసాగించాలా, విడుదల చేయాలా అనే అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు ఈ అదనపు సమయం ఉపయోగపడనుంది.
నవంబర్ 15న మౌంట్ మాంగనుయ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదో వన్డే జరగనుండటంతోనే రిటెన్షన్ గడువును పొడిగించినట్లు సమాచారం. మరోవైపు, డిసెంబర్ 16న బెంగళూరులో భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే కూడా షెడ్యూల్ అయింది. అదే రోజున ఐపీఎల్ మినీ వేలం జరగనుండటంతో వన్డే షెడ్యూల్‌లో మార్పు ఉంటుందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమై నవంబర్ 23 వరకు కొనసాగనుంది. ఫ్రాంచైజీలు తాము కొనుగోలు చేయాలనుకునే ఆటగాళ్ల తుది జాబితాను డిసెంబర్ 1లోగా సమర్పించాలి. డిసెంబర్ 3న ఆటగాళ్ల సెట్ల వివరాలతో కూడిన తుది వేలం రిజిస్టర్‌ను బీసీసీఐ విడుదల చేయనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!