

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (SAT) ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్’ కార్యక్రమం రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో విజయవంతంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీ.టీ. ఉష చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి క్రీడాకారులు, కోచ్‌లు, పీఈటీలు, పీడీలు, ఫిజియోథెరపిస్టులు, సీనియర్ క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన క్రీడా విజ్ఞానాన్ని చేరవేసి రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.
ప్రతి మొబైల్ బృందం ద్వారా క్రీడల ప్రాథమిక నైపుణ్యాలు, ఆధునిక శిక్షణా విధానాలు, గాయాల నివారణ, పునరావాసం, హైడ్రేషన్, క్రీడా పోషకాహారం, ఒత్తిడి నిర్వహణ, క్రీడాకారుల మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి మాట్లాడుతూ, తొలి విడత విజయవంతంగా పూర్తయిందని, త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమైన నియోజకవర్గ కేంద్రాలు, క్రీడల్లో చురుకైన ప్రాంతాలకు విస్తరించి మరింత మంది క్రీడాకారులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!