

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్లను గుర్తించి, వారికి తగిన భద్రతా సదుపాయాలు కల్పించేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత వయసు అంచనా టెక్నాలజీని విస్తరిస్తున్నట్లు నవంబర్ 9న ప్రకటించింది. తమ వయసును తప్పుగా నమోదు చేసి పెద్దవారిగా చూపించుకునే 18 ఏళ్లలోపు వినియోగదారులను కూడా ఈ టెక్నాలజీ గుర్తించనుంది. ఇందుకోసం యూజర్ల ప్రొఫైల్ వివరాలు, పోస్టులు, కామెంట్లు, బయో, క్యాప్షన్లు, ఫొటోలు, వీడియోలను ఏఐ విశ్లేషిస్తుంది. పుట్టినరోజు వేడుకలు, పాఠశాల తరగతులకు సంబంధించిన ప్రస్తావనలు, ఫొటోలు, వీడియోల్లో కనిపించే శారీరక లక్షణాలు వంటి అంశాల ఆధారంగా వయసును అంచనా వేస్తుంది. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిని ఆటోమేటిక్‌గా టీన్ అకౌంట్లలోకి మారుస్తుండగా.. 13 ఏళ్లలోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచేందుకు అనుమతి లేదు.
టీన్ అకౌంట్లలో భాగంగా వినియోగదారులు ఫాలో అవుతున్న లేదా ఇప్పటికే పరిచయం ఉన్న వ్యక్తుల నుంచే డైరెక్ట్ మెసేజ్‌లు స్వీకరించేలా పరిమితులు ఉంటాయి. హానికరమైన కామెంట్లను దాచడంతో పాటు అకౌంట్లను డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా ఉంచుతారు. తప్పుడు వయసు వివరాలు ఇచ్చి ఈ భద్రతా నిబంధనలను తప్పించుకునే ప్రయత్నాలను అడ్డుకునేందుకు టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తున్నట్లు మెటా తెలిపింది. ఇప్పటికే ఫేస్‌బుక్‌లోనూ ఇలాంటి వయసు అంచనా సాధనాలను ఉపయోగిస్తున్న సంస్థ.. ఈ ఏడాది చివర్లో థ్రెడ్స్‌లోనూ వీటిని విస్తరించాలని యోచిస్తోంది. టీనేజర్లలో సోషల్ మీడియా వినియోగం, దాని ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఏఐ ఆధారిత వయసు గుర్తింపు వ్యవస్థల విస్తరణతో వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతపై కూడా చర్చలు మొదలయ్యాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!