

ఆంత్రోపిక్ సంస్థ తన సొంత కృత్రిమ మేధ (AI) మోడళ్లను ఉపయోగించి మరింత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేస్తోందని స్వతంత్ర ఏఐ భద్రతా పరిశోధనా సంస్థ METR నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ 11 వారాల పాటు ఆంత్రోపిక్ అంతర్గత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించి ఈ నివేదికను రూపొందించింది. గత ఏడాది కాలంలో ఆంత్రోపిక్ సాధించిన ఏఐ అభివృద్ధి.. గతంలో రెండేళ్లలో నమోదైన ప్రగతికి సమానమని పేర్కొంది. అక్టోబర్ 2025 నుంచి ఆ సంస్థ మోడళ్ల బెంచ్‌మార్క్ స్కోర్లు గతంలో కంటే 1.9 రెట్లు వేగంగా పెరిగినట్లు అంచనా వేసింది. ఈ వేగానికి కంప్యూటింగ్ సామర్థ్యం పెరగడం కంటే ఏఐ సాయంతో జరుగుతున్న పరిశోధనే ప్రధాన కారణమని తెలిపింది. అత్యంత సామర్థ్యవంతమైన అంతర్గత ఏఐ మోడళ్లను ఉపయోగిస్తున్న ఉద్యోగులు.. ఏఐ సాయం లేకుండా పనిచేసినప్పటి కంటే సుమారు 12 రెట్లు అధిక ఉత్పాదకత సాధిస్తున్నట్లు వెల్లడించారు. గత ఆరు నెలల్లో అభివృద్ధి చేసిన మోడల్-2, మోడల్-3, మోడల్-4 అనే ఇంకా విడుదల కాని ఏఐ వ్యవస్థలు ఈ పురోగతిలో కీలక పాత్ర పోషించినట్లు నివేదిక పేర్కొంది.
మరోవైపు, ఏఐ వ్యవస్థలు మానవుల ప్రమేయం లేకుండానే తమ తర్వాతి తరపు మోడళ్లను రూపొందించి అభివృద్ధి చేసే స్థాయికి చేరుకోవచ్చనే ఆందోళనలు ఈ నివేదికతో మరింత పెరిగాయి. దీనినే ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్’గా పేర్కొంటారు. రాబోయే 12 నెలల్లో ఏఐ అభివృద్ధిని గణనీయంగా అడ్డుకునే సాంకేతిక పరిమితులు కనిపించలేదని METR తెలిపినప్పటికీ, ఈ అంచనాపై పూర్తి నమ్మకం లేదని స్పష్టం చేసింది. ఆంత్రోపిక్ అందించిన రహస్య పరిశోధన వివరాలు, మోడళ్ల పనితీరు సమాచారం, ఉద్యోగుల ఇంటర్వ్యూల ఆధారంగా నివేదిక రూపొందింది. అయితే, ప్రచురణకు ముందు నివేదికలోని చాలా కీలక అంశాలను ఆంత్రోపిక్ తొలగించడంపై METR అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల నివేదికలోని నిర్ధారణలను స్వతంత్రంగా పరిశీలించడం కష్టమవుతుందని పేర్కొంది. దీనిపై ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు సామ్ మెక్‌కాండ్లిష్ స్పందిస్తూ.. అభివృద్ధి వేగం వెనుక ఉన్న వివరాలను వెల్లడిస్తే సంస్థ వాణిజ్య రహస్యాలు బయటపడటంతో పాటు, ఇతర సంస్థలకు వేగంగా ముందుకు వెళ్లేందుకు మార్గం చూపినట్లవుతుందని వివరించారు. ఏఐ భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతూనే, సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడంపై ఆంత్రోపిక్ వైఖరి విరుద్ధంగా ఉందనే చర్చ కూడా మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!