

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతున్న వేళ, అమెజాన్ మరోసారి ఉద్యోగ కోతలు చేపట్టింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, సంస్థకు చెందిన డివైసెస్ విభాగంలో సుమారు 250 మంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగులను తొలగించింది. కిండిల్ ఈ-రీడర్లు, ఎకో స్మార్ట్ పరికరాలు ఈ విభాగంలో భాగంగా ఉన్నాయి. మెటా, ఒరాకిల్ సంస్థల మాదిరిగానే అమెజాన్ కూడా తెల్లవారుజామున ఈమెయిల్స్, టెక్స్ట్ సందేశాల ద్వారా ఉద్యోగులకు తొలగింపుల సమాచారాన్ని అందించినట్లు కథనాలు పేర్కొన్నాయి. కంపెనీ అవసరాల దృష్ట్యా కొన్ని ఉద్యోగాలను తొలగించాల్సి వచ్చిందని, ఇది కష్టమైన నిర్ణయమని అమెజాన్ వెల్లడించింది.
ఆసక్తికరంగా, డివైసెస్ విభాగం అభివృద్ధి చేసిన కొత్త అలెక్సా ఆధారిత ఉత్పత్తులను ప్రకటించిన రోజే ఈ ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి. రీడిజైన్ చేసిన ఎకో షో 16 స్మార్ట్ డిస్ప్లేతో పాటు అలెక్సా ఫొటో ఫ్రేమ్, ఎకో టైమ్ బెడ్‌సైడ్ క్లాక్ వంటి ఉత్పత్తులను కంపెనీ పరిచయం చేసింది. మరోవైపు, ఉద్యోగ కోతలకు ముందు రోజు అమెజాన్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రాధాన్యంపై అంతర్గత మెమో విడుదల చేసినట్లు సమాచారం. ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని, లేదంటే వెనుకబడిపోయే ప్రమాదం ఉందని అందులో పేర్కొన్నట్లు కథనాలు తెలిపాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!