

ఏఐ గణిత పరిశోధనల్లో వేగంగా విస్తరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీలో జరిగిన సమావేశం అనంతరం 16 మంది పరిశోధకులు రూపొందించిన లైడెన్ డిక్లరేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో ఈ ఆందోళనలను వివరించారు. వందలాది మంది గణిత శాస్త్రవేత్తలతో పాటు అంతర్జాతీయ గణిత సంఘం కూడా ఈ ప్రకటనకు మద్దతు తెలిపింది. ఏఐ రూపొందించే గణిత రుజువులు సరైనవిగా కనిపించినప్పటికీ వాటిలో పొరపాట్లు ఉండే అవకాశం ఉందని, దీంతో పరిశోధనల విశ్వసనీయత దెబ్బతినవచ్చని డిక్లరేషన్ హెచ్చరించింది.
మానవ రచనలకు సరైన గుర్తింపు లేకపోవడం, ఏఐ వినియోగంపై పారదర్శకత లోపించడం, పరిశోధనల్లో పక్షపాతం పెరగడం, ఆధునిక ఏఐ సాధనాలకు అందరికీ సమాన ప్రాప్యత లేకపోవడం వంటి అంశాలపై కూడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓపెన్‌ఏఐ, గూగుల్ డీప్‌మైండ్ వంటి సంస్థలు తమ ఏఐ మోడళ్లు దశాబ్దాలుగా పరిష్కారం కాని గణిత సమస్యలను పరిష్కరించాయని ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పరిశోధనల్లో ఏఐ వినియోగాన్ని బహిరంగంగా వెల్లడించడం, నైతిక ప్రమాణాలను పాటించడం, ప్రచురణలకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడం అవసరమని డిక్లరేషన్ సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!