

ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఓపెన్‌ఏఐ ‘చాట్‌జీపీటీ వాలెట్’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇందులో భాగంగా డాట్స్ (Dots)గా పిలిచే వ్యక్తిగత ఏఐ ఏజెంట్లు వినియోగదారుల తరఫున వస్తువులను ఎంపిక చేయడం నుంచి ఆర్డర్ పూర్తి చేసి చెల్లింపులు చేయడం వరకు అన్ని పనులు నిర్వహించగలవు. నవంబర్ 13న ప్రకటించిన ఈ ఫీచర్‌లో వినియోగదారులు ముందుగానే తమ చెల్లింపు కార్డును అనుమతించాలి. కొనుగోలు చేసే వస్తువులు, మొత్తం ఖర్చును పరిశీలించిన తర్వాతే ఆర్డర్‌ను ఆమోదించవచ్చు. ఫేస్ ఐడీ లేదా వేలిముద్ర ద్వారా చెల్లింపులకు అనుమతి ఇవ్వొచ్చు. తొలుత అమెరికాలో 18 ఏళ్లు పైబడిన కొంతమంది చాట్‌జీపీటీ ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమెరికాలో జారీ చేసిన వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డులకు మద్దతు ఇస్తోంది.
యాపిల్ పే తరహాలో టోకనైజేషన్ విధానాన్ని ఉపయోగించడం వల్ల వినియోగదారుల అసలు కార్డు వివరాలు ఏఐ ఏజెంట్లకు లేదా వ్యాపారులకు నేరుగా తెలియవు. అవసరమైనప్పుడు డెలివరీ చిరునామా, సంప్రదింపు వివరాలను మాత్రమే వ్యాపారులతో పంచుకుంటుంది. భవిష్యత్తులో ఖర్చు పరిమితులు నిర్ణయించుకునే అవకాశం, నిర్దిష్ట వస్తువుల కొనుగోళ్లకు ముందస్తు అనుమతులు ఇచ్చే సదుపాయాలను కూడా తీసుకురావాలని ఓపెన్‌ఏఐ భావిస్తోంది. ఈ విధానానికి అనుగుణంగా తమ వెబ్‌సైట్లను సిద్ధం చేసుకునేందుకు ఆన్‌లైన్ రిటైలర్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే గోప్యత, భద్రతా కారణాలతో కొన్ని ప్రముఖ రిటైల్ సంస్థలు ఏఐ ఏజెంట్లకు తమ వెబ్‌సైట్లలో ప్రవేశాన్ని పరిమితం చేస్తున్నాయి. దీంతో ఏఐ ఆధారిత షాపింగ్ రంగంలో టెక్నాలజీ సంస్థలు, ఆన్‌లైన్ వ్యాపార సంస్థల మధ్య పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!