

భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దాని పూర్తి ఆర్థిక విలువ, ప్రయోజనాలు రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో దశలవారీగా అందుబాటులోకి వస్తాయని 360 వన్ క్యాపిటల్ పరిశోధన నివేదిక తెలిపింది. ప్రాజెక్టుల ప్రారంభం, అంతర్జాతీయ వినియోగదారుల అనుమతులు, ఉత్పత్తి స్థిరత్వం సాధించడం వంటి కీలక దశల ద్వారా ఈ రంగం ముందుకు సాగుతుందని పేర్కొంది. భారత్‌లో సెమీకండక్టర్ల డిమాండ్ 2025లో 56 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4.6 లక్షల కోట్లు) ఉండగా, 2030 నాటికి 117 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.9.7 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా వేసింది. ఇది ఏటా దాదాపు 16 శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0 కింద ఆమోదించిన 12 ప్రాజెక్టుల ద్వారా 18 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి. రానున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా మరో 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. చిప్ తయారీ కేంద్రాలు, ఓఎస్ఏటీ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ఆదాయాలు రావడానికి కొంత సమయం పట్టినా, నిర్మాణం, విద్యుత్, నీటి వసతులు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఇంజినీరింగ్, ఆటోమేషన్, పరికరాల సహాయక సేవలు వంటి అనుబంధ రంగాలకు సమీప భవిష్యత్తులో భారీ అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. ఈ రంగాన్ని 10 నుంచి 15 ఏళ్ల దీర్ఘకాలిక దృష్టితో చూడాలని, నాణ్యమైన చిప్‌లను స్థిరంగా తయారు చేయడం, అంతర్జాతీయ వినియోగదారుల నమ్మకం పొందడం, భారీ స్థాయిలో ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడమే ప్రధాన సవాళ్లని నివేదిక స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!