

మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అయితే, ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఐటీ, రియల్టీ రంగాల షేర్లలో విక్రయాలు సూచీలను కిందకు లాగాయి. చివరి గంటల్లో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు తిరిగి కోలుకుని లాభాలను నిలబెట్టుకున్నాయి. సెన్సెక్స్ 772.75 పాయింట్లు పెరిగి 81,879 వద్ద ముగియగా, నిఫ్టీ 210 పాయింట్లు లాభపడి 25,255 వద్ద స్థిరపడింది.
క్రితం సెషన్‌లో 81,106.65 వద్ద ముగిసిన సెన్సెక్స్.. బుధవారం ఉదయం దాదాపు 1,100 పాయింట్ల లాభంతో 82,248.68 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఒక దశలో 82,520 పాయింట్లకు చేరుకుని ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, ఈ స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీపై ఒత్తిడి పెరిగింది. ఐటీ, రియల్టీ షేర్లలో అమ్మకాల కారణంగా సెన్సెక్స్ ఇంట్రాడేలో 81,417 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంటే రోజులో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి 1,000 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరి ట్రేడింగ్ గంటల్లో కొనుగోళ్లు పెరగడంతో తిరిగి కోలుకుని లాభాల్లో ముగిసింది. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 8 పైసలు బలపడి ₹93.69 వద్ద స్థిరపడింది.
మార్కెట్ల ర్యాలీకి పలు అంశాలు దోహదపడ్డాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. మంగళవారం ట్రేడింగ్‌లో బ్యారెల్ ధర 90 డాలర్ల దిగువకు చేరి మూడు నెలల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర స్వల్పంగా పెరిగి 92 డాలర్లకు చేరినప్పటికీ మార్కెట్లలో సానుకూల ధోరణి కొనసాగింది. విదేశీ సంస్థాగత మదుపర్లు భారత మార్కెట్లలో కొనుగోళ్లు కొనసాగించడం కూడా కలిసొచ్చింది. మునుపటి సెషన్‌లో వారు రూ.7,212 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. నవంబర్ 2 నుంచి 9 మధ్య ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.53,739 కోట్లుగా నమోదైనట్లు అందిన గణాంకాలు సూచిస్తున్నాయి. పలు కంపెనీల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడమూ మార్కెట్లకు మద్దతుగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!